సభ్యత్వ రిసిప్ట్ ను అందజేస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
తెలంగాణ వెబ్ న్యూస్, అంబర్ పేట: మజ్లిస్ పార్టీ మేయర్ పాలనలో జీహెచ్ఎంసీలో అవినీతి పెరిగిపోయి, కోట్లాది నిధుల దుర్వినియోగం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ లో మజ్లిస్ ఆగడాలను అంతమొందించాలంటే అది ఒక బీజేపీకే సాధ్యమవుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని తసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం కిషన్ రెడ్డి నివాసముంటున్న బర్కత్ పుర డివిజన్ లోని 237వ బూత్ లో పార్టీ సభ్యత్వాన్ని బూత్ కమిటీ అధ్యక్షుడి ద్వారా స్వీకరించారు. ఈ సందర్బంగా ఆ బూత్ పరిధిలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ పార్టీ సభ్యత్వాన్ని చేపట్టారు. వినాయక రెసిడెన్సీలోని ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేసీనా అది మజ్లిస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని, గ్రేటర్ హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలంటే బీజేపీకే ఓటు వేసి గెలిచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్కత్ పుర కార్పొరేటర్ దొడ్డి రాం బాబు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు అరవింద్, 237 పోలింగ్ ఇన్ చార్జీ మురళి, అనిల్ అరోరా, కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

